డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన... సీఎం కేసీఆర్ కు అరుదైన అవకాశం
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు అరుదైన అవకాశం లభించింది.
హైదరాబాద్: ప్రపంచానికే పెద్దన్నలాంటి దేశం అమెరికా. అలాంటి శక్తివంతమైన దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఇండియాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు మన దేశ సంస్కృతి, సాంపద్రాయాలను తెలియజేస్తూ మర్యాదపూర్వక ఆతిథ్యాన్ని అందించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. ఈ విందుకు దేశంలోని అత్యంత ప్రముఖులను మాత్రము ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే ఆ విందులో పాల్గొనే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కింది.
వచ్చే సోమవారం అంటే ఫిబ్రవరి 24వ తేదీన ట్రంప్ ఇండియాకు రానున్నారు. ఆ తర్వాతి రోజు అంటే 25వ తేదీన రాష్ట్రపతి భవన్ లో ఆయనకోసం ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం అందింది.
read more సర్కార్ బడికి మెలానియా ట్రంప్: కేజ్రీవాల్ కు భారీ షాక్
దీంతో సోమవారం సాయంత్రం లేదా మంగళవారం మద్యాహ్నం లోపు కేసీఆర్ డిల్లీకి వెళ్లనున్నారు. 25వ తేదీన రాత్రి 8గంటలకు రాష్ట్రపతి, అమెరికా అధ్యక్షులు, ప్రధానితో కలిసి విందులో పాల్గొననున్నారు. అయితే సీఎం డిల్లీకి ఎప్పుడు పయనమవుతారన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
విశిష్ట అతిథి ట్రంప్ కోసం ఏర్పాటుచేసిన ఈ విందుకు అతి తక్కువగా అంటే కేవలం 90 నుంచి 95 మంది అథితులకు మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు.ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో సహా కేవలం కొద్దిమంది కేంద్ర మంత్రులకు మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానం అందింది. రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ సీఎంతో పాటు అస్సాం, హర్యానా, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలకు చెందిన మొత్తం 8 మంది ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.