పేదలకు గృహ నిర్మాణ పథకంలో కొల్లూరు ఒక మోడల్ గా నిలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఈరోజు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, హౌసింగ్ మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లలోకి వెళ్లి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించడంతో పాటు ఇతర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దాదాపుగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, దీనికి అదనంగా నిర్మించాల్సిన మౌలికవసతుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కొల్లూరులో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల  ప్రాంతాన్ని ఆదర్శ టౌన్ షిప్  తయారు చేస్తామన్నారు. ఇంత భారీ ఎత్తున ఒకే చోట పేదలకోసం పక్కా ఇళ్ల నిర్మాణం దేశంలో ఎక్కడా చేపట్టలేదని మంత్రి గుర్తు చేశారు.

ఇప్పటికే సుమారు పది రాష్ట్రాల ప్రతినిధులు సందర్శించి తమ ప్రయత్నాన్ని అభినందించారని, నిర్మాణం పూర్తయిన తర్వాత దేశం మొత్తం ఖచ్చితంగా కొల్లూరు టౌన్షిప్ నమూనాను అధ్యయనం చేస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం రాసి కన్నా వాసి ముఖ్యం అన్న తీరుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సకల హంగులతో చేపడుతుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రతి చోట అన్నిరకాల కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాన దృష్టి సారిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వతా ఇక్కడ నివసించే జనాభా ఒక మున్సిపాలిటీలో స్థాయిలో ఉంటుందని, ఈ నేపథ్యంలో ఒక మునిసిపాలిటీలో ఉండాల్సిన అన్ని సౌకర్యాలను ఇక్కడ కల్పించాల్సిందిగా పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.

ఇందులో భాగంగా పాఠశాల, హాస్పిటల్, పార్కులు, మంచినీటి సదుపాయం, మురుగునీటి శుద్ధి, నిర్వహణ, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ మొదలయిన కనీస సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయాల్సిందిగా కేటీఆర్ సూచించారు.

కొల్లూరు టౌన్‌షిప్ క్లీన్, స్మార్ట్ అండ్ సేఫ్ ప్రాంతంగా తయారు చేసేందుకు అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల ఎర్పాటు, గ్రీనరీ పెంచేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు.

లబ్ధిదారుల ఎంపిక పూర్తయి, ఇక్కడికి చేరుకున్న తర్వాత వారికి అన్ని సౌకర్యాలు ఉన్న ఒక అదర్శ పట్టణంలో ఉన్నామన్న భావన కలిగేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. కేటీఆర్ వెంట హౌసింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ తోపాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మరియు శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.