హైదరాబాద్: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ రాష్ర్టం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. బుధవారం నాడు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో న్యూజెర్సీ గవర్నర్ నేతృత్వంలో తెలంగాణలో పర్యటిస్తున్న బృందం, పురపాలకశాఖ మంత్రి కెటి రామారావు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

 ఈ ఒప్పందంపైన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యస్.కె. జోషి, న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీలు సంతకాలు చేశారు. నిన్నటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో సమావేశం అవుతున్నామని వాణిజ్య అనుకూల వాతావరణం ఉన్నదని గవర్నర్ తెలిపారు. 

ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాలు విద్య, వ్యాపార వాణిజ్య అవకాశాల్లో పరస్పరం సహాకరించుకుంటాయని గవర్నర్ తెలిపారు. ఐటి, ఫార్మా లైప్ సైన్సెస్, బయోటెక్,  ఫిన్ టెక్, డాటా సెంటర్స్, క్లీన్ ఎనర్జీ, ఉన్నత విద్య, టూరిజం వంటి రంగాల్లో ఇరు రాష్ట్రాలు సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోతామని తెలిపారు. 

న్యూజెర్సీ రాష్ట్రంతో జరిగిన ఒప్పందం ద్వారా తెలంగాణకు అయా రంగాల్లో మేలు కలుగుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. అమెరికాలో తాను కొంత కాలంపాటు న్యూజెర్సీలో ఉన్నానని గవర్నర్ కు మంత్రి కెటిఆర్ తెలిపారు.

, అమెరికాలో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో న్యూజెర్సీ ఒకటన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ ఛీప్ సెక్రటరీ అజయ్ మిశ్రా, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ అమెరికన్ కాన్సుల్ జనరల్ అధికారులు పాల్గోన్నారు.