హైదరాబాద్: ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు కావని మరోసారి నిరూపితమైంది. ఖండాంతరాలు, దేశాలు దాటైనా ప్రేమను గెలిపించుకుంటున్నారు ప్రేమికులు. దీన్ని మరోసారి నిరూపించారు తెలంగాణ యువకుడు, జర్ననీ అమ్మాయి.  తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షులు స్వర్ణాకర్, జర్ననీ అమ్మాయి జూలియా మూడు ముళ్ల బంధంతో త్వరలో ఏడడుగులు వేయనున్నారు. 

స్వర్ణాకర్, జూలియా హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. తమ వివాహానికి రావాల్సిందిగా ఎంపీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి ప్రేమ గురించి కవిత అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జూలియా–స్వర్ణాకర్ ల జోడీని మాజీ ఎంపీ కవిత అభినందించారు.

సికింద్రాబాద్ కు చెందిన స్వర్ణాకర్ కొన్నేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం జర్ననీ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే, తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇలా తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షుడి స్థాయికి చేరుకున్నాడు. అతడు జర్మనీలోని తెలంగాణ వాసులతో బతుకమ్మ, బోనాలతో పాటు, తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 

అయితే స్వర్ణాకర్ తనతో పాటే పనిచేస్తున్న స్థానిక యువతి జూలియాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అంతేకాదు వారి ప్రేమను ఇరువైపులా తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో స్వర్ణాకర్-జూలియాల పెళ్లికి నిశ్చయించారు. ఈ నెల 22 న బేగంపేటలో భారతీయ సాంప్రదాయం ప్రకారం వీరిద్దరి వివాహం జరగనుంది.