హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. హైదరాబాదులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

నిరసన వ్యక్తం చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేసే క్రమంలో సీపీఐఎంఎల్  నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగి పోయిందిపోలీసులు వ్యాన్ లో ఎక్కించే క్రమంలో రెండు తలుపుల మధ్య అతని వేలు పెట్టి నొక్కి కట్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. 

"నన్ను కేసీఆర్ చంపమన్నాడా ? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమనమా?" అని పోటు రంగారావు పోలీసులను ప్రశ్నించారు.

బంద్ లో పాల్గొంటున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తో పాటు టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా అరెస్టయ్యారు. 

Also Read: తెలంగాణ బంద్: సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి అరెస్ట్

బంద్ సందర్బంగా షాద్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాదులోని నాగోల్ లో గల బండ్లగుడ డిపో నుంచి బస్సును తీయడానికి ప్రయత్నించిన తాత్కాలిక డ్రైవర్ ను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. అతనిపై దాడి కూడా చేశారు. 

బంద్ సందర్భంగా హైదరాబాదులో ఆర్టీసీ బస్సులు ఒక్కటి రండు మాత్రమే కనిపించాయి. రోడ్ల మీద ట్రాఫిక్ చాలా పలుచగా ఉంది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసేశారు.