హైదరాబపాద్: ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఎసి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం బంద్ జరుగుతోంది. బంద్  సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేపట్టిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళ కండక్టర్లను హైదరాబాదులోని కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేశారు. 

మిథాని డిపోకు చెందిన 11 మంది మహిళా కండక్టర్లు తెలంగాణ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేసి మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుభవాని అనే మహిళ కండక్టర్ మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో షుగర్ ఎక్కువై పడిపోయింది. 

తమ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా మహిళా కండక్టర్లు డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని  కౌసల్య,సరిత, రాధ,అనిత,అరుణలను తెలిపారు.

బంద్ సందర్భంగా హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగోల్ ప్రాంతంలోని బండ్లగుడా డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్ పై దాడి చేశారు. షాద్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులు టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని, టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డిలను కూడా అరెస్టు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోటు రంగారావు అనే సిపిఐఎంఎల్ నేత బొటన వేలు తెగింది.