హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి టీవీ సీరియళ్లు చూస్తారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు ప్రస్తుతం మంచి ప్రతిభ గల ఆర్టిస్టులు సీరియళ్లలో నటిస్తున్నారని, అందువల్లనే తాను కూడా నిత్యం టీవీ సీరియళ్లు చూస్తున్నానని ఆయన అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సత్యసంగీత ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో పలువురు కళాకారులకు, తెలుగు మూవీ టీవీ ఆర్టిస్ట్స్ యూనియన్ సభ్యులకు కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. రవీంద్ర భారతిలో శనివారం జరిగిన కార్యక్రమంలో పోచారం శ్రీనివాస రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు. 

రాజకీయ నాయకులకు కొంత ఒత్తిడి ఉంటుందని, సీరియళ్లూ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే ఒత్తిడి తగ్గుతుందని పోచారం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక మండలి చైర్మన్ దేవర మల్లప్ప, సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బి. శివకుమార్, సినీ నటుడు రఘుబాబు, సీల్ వెల్ కార్పోరేషన్ ఎండి బండారు సుబ్బారావు తదితరలు హాజరయ్యారు.