హైదరాబాద్ లో విషాదం... కొడుకు ఉద్యోగం కోసం తల్లి ఆత్మహత్య
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తనకే ఎదురుతిరగడం తట్టుకోలేక ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్: ఆ తల్లికి కొడుకంటే వల్లమాలిన ప్రేమ. అతడు మంచి ఉద్యోగం చేస్తూ జీవితంలో సెటిలై ఆనందంగా జీవించాలని కోరుకుంది. అయితే కొడుకు మాత్రం ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఖాళీగా వుండటం ఆ తల్లికి నచ్చలేదు. దీంతో ఆ తల్లి ఏకంగా ప్రాణాలనే బలితీసుకుంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ భూత్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన పేటా పెంటయ్య-మౌనిక దంపతులు. వీరికి ఓ కొడుకు, కూతురు సంతానం. గ్రామంలో సరయిన పనులు లేకపోవడంతో ఈ కుటుంబం హైదరాబాద్ కు మకాం మార్చింది. పెంటయ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు.
read more కృత్రిమ గర్భధారణకు ఒప్పందం: వక్రబుద్ధితో మహిళపై అఘాయిత్యం
అయితే తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తాడనుకున్న కొడుకు ఏ పనీ లేకుండా ఖాళీగా తిరుగుతుండటంతో మౌనిక తీవ్ర మనోవేధనకు గురయ్యింది. ఈ క్రమంలోనే ఏదయినా పని చూసుకుని తండ్రికి సాయపడాలని ఆమె కొడుకును మందలించింది. దీంతో తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగడంతో కొడుకు ఇంటినుండి బయటకు వెళ్లిపోయాడు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తన మాట వినకుండా గొడవకు దిగడాన్ని ఆ తల్లి తట్టుకోలేక పోయింది. దీంతో తాము నివాసమండే భవనంలోనే ఆరో అంతస్తుపైకి వెళ్లి కిందకు దూకింది. దీంతో తీవ్రంగా గాయపడింది.
కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడటంతో డాక్టర్లు కూడా ఆమె ప్రాణాలన కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ ఆ తల్లి మృతిచెందింది.