హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో శనివారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాలన, ప్రజాసంక్షేమం, అభివృద్ది, వివిధ సమస్యలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పోడు భూములపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. 

పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులను రైతుబంధు పథకం వర్తించదని స్ఫష్టం చేశారు. వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తే మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం వుందని... అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పోడుభూముల సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు. 

read more  జగన్ చెప్పారు, ఏపిలో పెరిగే జిల్లాల సంఖ్య ఇదే: కేసీఆర్

రాష్ట్రంలో స్వల్పంగా కరెంట్ చార్జీలు పెంచుతామని, వచ్చే బడ్జెట్ లో వాటిని పెంచుతామని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం లేదని చెప్పారు. అప్పులు తెచ్చి కరెంట్ ఇస్తున్నట్లు కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారని, ఆరేళ్లలో ఒక్కసారి మాత్రమే కరెంట్ చార్జీలు పెంచామని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కు అడ్డుకట్టవేశామని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని, ఈ పథకాన్ని దేశం యావత్తు ప్రశంసించిందని ఆయన చెప్పారు. మిషన్ భగీరథపై అన్ని వివరాలు తీసుకుని వచ్చి మాట్లాడుతుంటే కాంగ్రెసువాళ్లు పారిపోయారని ఆయన అన్నారు. 

read more  ఇంట్లో పుట్టా, నా బర్త్ సర్టిఫికెట్ లేదు, నువ్వెవరంటే..: సీఏఏపై కేసీఆర్

సభలో పిచ్చికూతలు కూసిన కోమటిరెడ్డి రాజగోపాల్ నియోజకవర్గంలో 334 నివాసాలకు నీళ్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయం ఆ సభ్యుడికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు ఈ పథకం కోసం ఇప్పటికే రూ.41 వేల కోట్లు ఖర్చు చేశామని మరో 3 వేల కోట్లకు టెండర్లను ఆహ్వానిస్తామని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని ఆయన చెప్పారు.