హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాదు మెట్రో రైలు ప్రయాణికులను చేరవేయడంలో రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాదు మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య 4 లక్షల మార్కును దాటినట్లు మెట్రో ఎఁడీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. 

ఆర్టీసీ సమ్మెతో మెట్రో రైలులో రద్దీ పెరిగింది. నాలుగు అదనపు రైళ్లను నడుపుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. అదే విధంగా 830 ట్రిప్పులు నడుపుతున్నట్లు కూడా తెలిపారు.  గత 16 రోజులుగా టీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న విషయం తెలిసిందే.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు మెట్రో రైలు వరంగా మారింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్ల ఫ్రీక్వెన్సీని కూడా పెంచారు. ప్రతి 3 నిమిషాలకు ఓ రైలు నడుస్తోంది. అయినప్పటికీ మెట్రో రైళ్లు క్రిక్కిరిసి నడుస్తున్నాయి.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెసు పార్టీ ఇచ్చిన పిలువు మేరకు సోమవారం ప్రగతిభవన్ ముట్టడి జరిగింది. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, తదితర కాంగ్రెసు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించుకుని ప్రగతి భవన్ గేట్ దాకా రాగలిగారు. 

ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో బేగంపేట మెట్రో స్టేషన్ ను మూసివేశారు. మెట్రో స్టేషన్ కు తాళం వేసినట్లు అధికారులు చెప్పారు. ఆందోళనకారులు మెట్రో స్టేషన్ లోకి దూసుకు వచ్చే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా ఆ పనిచేశారు.