గేమింగ్ యాప్‌తో స్కామ్.. నిందితుడి ఇంట్లో రూ.7 కోట్ల నగదు.. కొన‌సాగుతున్న ఈడీ సోదాలు  

పశ్చిమ బెంగాల్‌లో మ‌రోసారి ఈడీ సోదాలు చేసింది. గేమింగ్ యాప్ స్కామ్ ప్ర‌ధాన నిందితుడైన  వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసంలో జరిపిన సోదాల్లో ఏడు కోట్ల రూపాయల నగదుతోపాటు పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. 

Rs 7 crore seized in ED raid on Kolkata businessman in gaming app scam case

గత కొద్ది రోజులుగా పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియ‌మ‌క‌ కుంభకోణం, పశువుల అక్రమ రవాణా, బొగ్గు కుంభకోణం వంటి కేసుల్లో సీబీఐతో పాటు ఈడీ, సీఐడీలు  విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాయి. తాజాగా గేమింగ్ యాప్ స్కామ్‌ కేసు విచార‌ణ‌లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చురుగ్గా దర్యాప్తు చేస్తున్నది. శనివారం (సెప్టెంబర్ 10) ఉదయం కోల్‌కతాలోని నాలుగు చోట్ల ఈడీ బృందం దాడులు చేసింది.  

జాతీయ మీడియా సంస్థ‌ల కథ‌నంప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్, మెక్‌లియోడ్ స్ట్రీట్, గార్డెన్ రీచ్, మోమిన్‌పూర్‌లలో ఉదయం నుండి ఈడీ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ బృందాలు పెద్ద సంఖ్యలో సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందితో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో కోల్‌కతాలో (ఈడీ రైడ్ ఇన్ కోల్‌కతా) భారీ మొత్తంలో న‌గ‌దు సీజ్ జరిగింది. 

గార్డెన్ రీచ్ ప్రాంతంలోని వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసంలో జరిపిన సోదాల్లో ఏడు కోట్ల రూపాయల నగదుతోపాటు పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు ఇంకా కొన‌సాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న నగదు లెక్కింపు కోసం క్యాష్‌ కౌంటింగ్‌ యంత్రాలను ఈడీ అధికారులు రప్పించారు. పట్టుబడిన నగదు రూ.15 కోట్లు దాటవచ్చని భావిస్తున్నారు. మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా ప్రజల ఖాతాల నుంచి డబ్బు మళ్లించిన ఉదంతం చోటుచేసుకుంది. ఈ మేరకు ఈడీ చర్యలు చేపట్టింది. రెండేళ్ల క్రితం మొబైల్ గేమ్ యాప్‌లో మోసం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈడీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు తనిఖీల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.
  
‘ఈ-నగ్గెట్స్’ అనే మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా భారీ ఎత్తున మోసానికి పాల్పడిన‌ట్టు తెలుస్తుంది. ఈ కుంభ‌కోణంలో భాగంగా ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం.. యూజ‌ర్ల‌కు రివార్డులు, కమీషన్‌ ఇచ్చారు. వారు పొందిన 
బ్యాలెన్స్ ను వ్యాలెట్‌ ద్వారా సుల‌భంగా తీసుకునే సౌకర్యం కల్పించారు. ఈజీగా డ‌బ్బు పొంద‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కం క‌లిగింది. ఈ క్రమంలో యూజ‌ర్లు భారీమొత్తంతో ఆర్డర్లు కొనుగోలు చేశారు. ఇలా ప్రజల నుంచి కోట్లలో డబ్బులు జమ అయిన.. తర్వాత ఒక్కసారిగా న‌గ‌దును విత్‌ డ్రా చేసుకునే సౌక‌ర్యాన్ని నిలిపివేశారు. అదే స‌మయంలో సిస్టమ్‌, సర్వర్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో ప్రొఫైల్స్‌తోపాటు డేటా అంతా ఏరేజ్ చేశారు. దీంతో మోసపోయినట్లు బాధితులు గ్రహించారు. పోలీసులను ఆశ్ర‌యించారు. 

కాగా, మొబైల్ గేమింగ్ యాప్ యూజ‌ర్ల‌ను మోసం చేసిన నిందితుడు అమీర్ ఖాన్, ఇతరులపై ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త అమీర్‌ ఖాన్ ఇంట్లో దాడులు చేసి కోట్లలో డబ్బులు, ఇతర ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో అతని మంచం కింద ఏడు కోట్ల రూపాయలు దొరికాయి. ప్లాస్టిక్ సంచుల్లో రెండు వేలు, ఐదు వందల నోట్లు బయటపడ్డాయి. ఈడీ బృందం ఘటనాస్థలిని ఇంకా పరిశీలిస్తోంది. 

SSC స్కాంలో 50 కోట్లు రికవరీ

పశ్చిమ బెంగాల్‌లోని ఎస్‌ఎస్‌సి స్కామ్‌లో మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో నిర్వ‌హించిన‌ దాడులలో రూ. 50 కోట్లు దొరికిన‌ట్టు అధికారులు తెలిపారు. ఎస్‌ఎస్‌సి స్కాంలో నగదు రికవరీ కావడంతో పార్థ ఛటర్జీని మమతా బెనర్జీ ప్రభుత్వం ప‌ద‌వీ నుంచి తొలగించింది. అదే సమయంలోఆయ‌న‌ను  TMC  పార్టీ నుండి కూడా సస్పెండ్ చేశారు. 

రాష్ట్రంలో స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఇంతకుముందు ఈడీ పెద్ద చర్య తీసుకుంది. జులైలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. విచారణలో అందిన సమాచారం మేరకు వివిధ ప్రాంతాల్లోని అర్పిత ఫ్లాట్ల నుంచి దాదాపు రూ.50 కోట్లను ఈడీ రికవరీ చేసింది. అదే సమయంలో అర్పిత ఇంట్లో చాలా డైరీలు దొరికాయి. ఈడీ వర్గాల ప్రకారం.. కోడ్‌వర్డ్‌లో లంచం మొత్తం గురించి వ్రాయబడింది. ఈ దాడుల అనంత‌రం.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విప‌క్షాలు టార్గెట్ చేశాయి.   
  
బెంగాల్ SSC స్కామ్‌లో పార్థా ఛటర్జీని జూలై 23న  ఈడీ అరెస్టు చేసింది. అర్పితకు చెందిన రెండు ఫ్లాట్లలో జరిగిన దాడుల్లో దాదాపు 50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

నార్త్ 24 పరగణాస్‌లోని బెల్గారియాలోని అర్పిత ఫ్లాట్ లో నగదు, 10 ఇనుప చెస్ట్‌లలో ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో 27 కోట్ల 90 లక్షల నగదు దొరికింది. ఇది కాకుండా ఒక్కొక్కటి కిలో చొప్పున ఉన్న‌ మూడు బంగారు ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 500-500 గ్రాముల బంగారం, బంగారు పెన్నులు, ఆరు బ్రాస్లెట్లు కూడా లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న బంగారం, ఆభరణాల విలువ రూ.4.31 కోట్లు. అని ఈడీ పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios