హైదరాబాద్ పాతబస్తీలో పట్టపగలు గూండాలు దారుణానికి ఒడిగట్టారు. అందరూ చూస్తుండగానే ఓ ఇంటిపై దాడి చేసి వీరంగం సృష్టించారు. పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెడితే నగరంలోని పాతబస్తీలో ఒక ఇంటిపై 20 మంది గుండాలు దాడి చేశారు.  దీంటో ఇంట్లో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వస్తువులు ధ్వంసమయ్యాయి. గూండాలు వెళ్లగానే స్థానికులు గాయపడిన వారిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇదంతా రియల్ మాఫియా పనేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎస్ఐ అరవింద్ పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

‘ కొంత మంది గూండాలు మా ఇంట్లోకి చొరబడి మా తల్లి పై దాడి చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు తీసుకున్న ఎస్ఐ అరవింద్.. ఇంటి పత్రాలకు తీసుకురమ్మని నాకు ఉచిత సలహాలు ఇచ్చారు. ఆ 20 మంది గూండాలను అరెస్ట్ చేసి పోలీసులు మాకు న్యాయం చేయాలి’ అని మీడియా ముఖంగా పోలీసు అధికారులను బాధితుడు వేడుకున్నాడు. 

కాగా.. డయల్ 100తో స్పందించిన ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ రెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాధితులకు భరోసానిచ్చారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని.. బాధితులకు న్యాయం చేస్తామని ఇన్‌స్పెక్టర్ మీడియాకు వెల్లడించారు. 

అయితే ఇంతకీ ఆ గూండాలు ఎవరు..? ఎవరు పంపారు..? ఎందుకు పంపారు..? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.