హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో పది మంది యువకులు తరిమికొడుతూ హత్య చేసిన ఘటనకు గల కారణం వెలుగు చూసింది. ఓ యువతి విషయంలో ఇరువురు యువకుల మధ్య తగాదా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య వివాదాన్ని రూపుమాపి, ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు సిద్దమయ్యారు. అయితే, రాజీకి వచ్చినట్లే వచ్చి ఓ యువకుడు కత్తితో ప్రత్యర్థిపై దాడికి ప్రయత్నించాడు. 

దాంతో అతనిపై ప్రత్యర్థి వర్గం ఎదురుతిరిగారు. అతన్ని తరిమి తరిమి హత్య చేశారు. బంజారాహిల్స్ కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఫియాజ్ (28) ఆ దాడిలో మరణించిన విషయం తెలిసిందే. ఫయాజ్ గత కొంత కాలంగా జగద్గిరిగుట్టలోని రిక్షాపుల్లర్స్ కాలానీలో ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. అతడికి స్థానికంగా ఉన్న ప్రశాంత్ కు మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. 

Also Read: హైదరాబాదు దారుణం: యువకుడిని తరుముతూ కత్తులతో నరికి చంపారు

మూడు రోజుల క్రితం ఇద్దరు కూడా బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. దానిపై ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఓ పెద్ద మనిషి ఇరువురిని పిలిచి రాజీ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తన వద్ద ఉన్న కత్తితో ఫయాజ్ ప్రత్యర్థులపై దాడికి ప్రయత్నించాడు. 

వెంటనే తేరుకున్న ప్రశాంత్, అతడి స్నేహితులు సాయి, నరేష్, టిల్లు మరి కొంత మంది యువకులు కత్తులతో ఫయాజ్ మీద దాడి చేశారు. అతను భయంతో పరుగు తీయగా, వెంబడించి చంపేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.