డిసెంబర్ ఒకటిన జరగనున్న బల్దియా ఎన్నికల కోసం ఎనిమిదివేలమంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నామని రాచకొండ సీపి మహేశ్ భగవత్ తెలిపారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడం, ప్రచారం ముగుస్తుండడంతో అభ్యర్థుల ప్రచారంపై పోలీసులు నిఘా పెంచారు.  

ఎన్నికల నిర్వహణ, బందోబస్తు మీద రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో 4వందలకు పైగా అభ్యంతరకరమైన  పోస్టింగ్ లను గుర్తించాము. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ తెలిపారు. 

కొందరు అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే ప్రసంగాలు, పోస్టింగ్ లతో ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారెవరైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

రాచకొండ పరిధిలో 30 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయి. 498 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు, 101 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. అయితే రాచకొండ పరిధిలో మొత్తం 8 వేల మందితో ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

ఈ క్రమంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో  711 మంది లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్నారని, వాటిలో 543 డిపాజిట్ అయ్యాయని తెలిపారు. ఇంకా 155 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు. వారంతా 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు తిరిగి వెళ్లిపోవాలని సూచించారు.