హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ చట్టాన్నివ్యతిరేకిస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మైనారిటీ ప్రజలు కదం తొక్కారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ ర్యాలీలు చేపట్టిన మైనార్టీ ప్రజలు ధర్నా చౌక్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

నిరసనకారులు భారీ ఎత్తున తరలిరావడంతో లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతమంతా జనసంద్రమయ్యింది. ముఖ్యంగా నాంపల్లి, ఆర్టీసి క్రాస్ రోడ్స్, హిమాయత్ నగర్,  నెక్లస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీ ఎత్తును ర్యాలీ కొనసాగింది. అలాగే మెహిదీపట్నంలో కూడా భారీ ఎత్తును మైనారిటీ  ప్రజలు రోడ్డుపైకి వచ్చి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. 

దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అలాగే ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. దీంతో ధర్నా చౌక్ ప్రాంతం బిజెపి, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక  నినాదాలతో దద్దరిల్లింది.