హైదరాబాద్: ఓ ప్రాణాన్ని కాపాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చూపించిన చొరవ నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది. ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కోసం ప్రత్యేక చొరవ చూపించి ట్రాఫిక్ ను క్లియర్ చేసి అందులోని పేషంట్ కు సకాలంలో వైద్యం అందేలా చేశాడు కానిస్టేబుల్. ఇలా అంబులెన్స్ ను ట్రాఫిక్ నుండి బయటకు తీసుకువచ్చేందుకు కానిస్టేబుల్ దాని ముందు పరుగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరస్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని అబిడ్స్ ప్రాంతంలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఆ అంబులెన్స్ లో ఓ పేషంట్ ప్రాణాపాయ స్థితిలో వున్నట్లు తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ అయ్యో పాపం అనుకోలేదు. ఎలాగయినా ట్రాఫిక్ ను క్లియర్ చేసి అంబులెన్స్ కు దారివ్వాలని భావించాడు. అంబులెన్స్ వెనకాల వస్తుండగా ముందు పరుగెత్తుతూ ట్రాఫిక్ ను క్లియర్ చేశాడు. 

 

ఇలా అతడు అంబులెన్స్ ముందు పరుగెత్తుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ ప్రాణాన్ని కాపాడేందుకు కానిస్టేబుల్ పడిన తపన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దీంతో ''ప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల కోసం, మీ భ‌ద్ర‌తే మాకు ముఖ్యం'' అంటూ క్యాప్ష‌న్‌ను జోడించి హైద‌రాబాద్ పోలీస్ శాఖ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియోను పోస్టు చేసింది. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ వీడియోపై స్పందిస్తూ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.