హైదరాబాద్ ను లక్ష్యంగాచేసుకుని నేపాలీ ముఠాలు ఇటీవల చోరీలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇంట్లో పనికి కుదిరి నమ్మకంగా వుంటూ  అదును చూసి ఆ ఇంటిని దోచేయడమే వీరి చోరీ స్టైల్. ఇలా నగరంలో ఇప్పటికే పలు చోరీలు జరగ్గా తాజాగా మరో ఇంట్లో కూడా సోమవారం రాత్రి దోపిడీకి పాల్పడింది ఈ ముఠా. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని నాచారం ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే ఓ నేపాలీ జంట పనికి కుదిరింది. సోమవారం ఆ ఇంట్లోని వాళ్లు శుభకార్యానికి వెళ్లగా ఓ వృద్దురాలు మాత్రమే వుంది. ఇదే అదునుగా భావించిన ఈ నేపాలీ జంట తమ పని కానిచ్చారు. మొదట వృద్దురాలికి మత్తుమందు ఇచ్చారు. ఆమె మత్తులోకి జారుకోగానే ఇంట్లోని  రూ.10లక్షల నగదు, 20తులాల బంగారాన్ని దోచేశారు.  

ఈ దోపిడీపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు సిసి కెమెరా పుటేజీని పరిశీస్తున్నారు. ఇలాంటి చోరీ ఇటీవల రాయదుర్గంలో కూడా జరిగింది. నెలరోజుల వ్యవధిలోనే రెండో ఘటన చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు నేపాలీ ముఠా సభ్యులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.