కాబోయే త‌ల్లుల ఆరోగ్యాన్ని కంటికి రెప్ప‌లా కాపాడ‌టంతో పాటు.. వారిలో పోటీత‌త్వాన్ని పెంచినందుకు కిమ్స్ గ్రూప్ ఆసుప‌త్రుల‌ను అభినందిస్తున్న‌ట్లు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ తెలిపారు. స్వయంగా గైన‌కాల‌జిస్టు అయిన తాను ఇలాంటి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. 

కాబోయే త‌ల్లుల‌కు కిమ్స్ క‌డిల్స్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మిసెస్ మామ్‌-20 గ్రాండ్ ఫినాలె కార్య‌క్ర‌మానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజ‌రై, విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అందించారు. ఈ పోటీలో సౌమ్య‌ల‌క్ష్మి విజేత‌గా నిలిచారు. ఫ‌స్ట్ ర‌న్న‌ర్‌గా ఉపాస‌న‌, సెకండ్ ర‌న్న‌ర్‌గా ఇస్మ‌తుల్లా ఉన్నారు. మిసెస్ పాష‌నేట్‌గా ఐశ్వ‌ర్య‌, మిసెస్ స్వీట్‌నెస్‌గా సాయిలేక్య కొకిరాల‌, మిసెస్ బ్రెయిన్‌గా వ‌వినా వైన‌, మిసెస్ స్మైల్‌గా మాధ‌వీరావు, మిసెస్ పాష‌నేట్ స్కిన్‌గా సుస్మితా సేన్‌, మిసెస్ బ్యూటిఫుల్ హెయిర్‌గా అనూషా బండె నిలిచారు. 

వారికి బ‌హుమ‌తులు అందించిన సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ, "ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నందుకు కిమ్స్ గ్రూప్ ఆసుప‌త్రుల‌కు అభినంద‌న‌లు. కాబోయే త‌ల్లుల‌కు అనేక అనుమానాలు వ‌స్తాయి.  వాట‌న్నింటినీ నివృత్తి చేయ‌డంతో పాటు.. వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇలాంటి మంచి కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం ఎంతో బాగుందన్నారు. 

మంచి ఆహారం, త‌గిన వ్యాయామం, ప్ర‌శాంత చిత్తం కోసం ధ్యానం, యోగా లాంటివి చేయ‌డం ఈ స‌మ‌యంలో వారికి చాలా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఇవ‌న్నీ చేస్తున్న డాక్ట‌ర్ శిల్పిరె‌డ్డి ఆలోచ‌నా విధానాన్ని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. క‌రోనా స‌మ‌యంలో అస‌లు వైద్య‌మే క‌ష్టంగా ఉన్న‌ప్పుడు కూడా కాబోయే త‌ల్లుల ఆరోగ్యాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుకున్నందుకు ప్ర‌శంసిస్తున్నాను" అన్నారు.

కాబోయే త‌ల్లుల‌ను ప్రోత్స‌హిస్తూ, వారిని ఈ పోటీ ద్వారా మ‌రింత ఆరోగ్య‌క‌రంగా ఉంచినందుకు డాక్ట‌ర్ శిల్పిరెడ్డిని అభినందిస్తున్న‌ట్లు కిమ్స్ ఆసుప‌త్రుల ఛైర్మ‌న్ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు అన్నారు.  ప్ర‌స‌వం అయిన త‌ర్వాత త‌ల్లులు కోలుకోవ‌డానికి 6 నెల‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టేది. కానీ ఇప్పుడు కేవ‌లం రెండు వారాల్లోనే వాళ్లు కోలుకుని మ‌ళ్లీ త‌మ ప‌నులు చేసుకోగ‌లుగుతున్నారు. వాళ్లు చేసిన వ్యాయామం, ధ్యానం, యోగా వ‌ల్ల హార్మోన్ల మార్పులు జ‌రిగి.. త్వ‌ర‌గా కోలుకుంటున్నారు" అని ఆయ‌న తెలిపారు.

గ‌చ్చిబౌలిలోని లీ మెరిడియ‌న్ హోట‌ల్లో ఆదివారం రాత్రి 7 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించిన మిసెస్ మామ్-2020 నాలుగో సీజ‌న్ కార్య‌క్ర‌మం వైభ‌వంగా సాగింది. కాబోయే త‌ల్లుల అనుమానాల‌ను తీరుస్తూ.. వారిలో ఒత్తిడిని నివారించి, చిన్న కుటుంబాల్లో అంత‌రాలు త‌గ్గించి, సాధార‌ణ కాన్పుల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ముందుగా డిసెంబర్ 12 నుంచి 19వ తేదీ వరకు గర్భిణుల కోసం పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

గర్భశంకర యోగా, వోగా, లామేజ్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ లాంటివాటి వల్ల భౌతికంగా తట్టుకునే శక్తి, కండరాల బలం పెరగడంతో పాటు వారికి అవసరమైన విశ్రాంతి, నొప్పి నివారణ.. వీటన్నింటితో పాటు గర్భిణులకు తమ ఆరోగ్యం బాగుపడుతోందన్న ఆత్మవిశ్వాసం కలిగింది. 

ఆహారం, పోషకాలు, చర్మసంరక్షణ, దంత సంరక్షణ, పిల్లల సంరక్షణ, టీకాలు.. వీటన్నింటిపై నిర్వహించిన కార్యక్రమాల వల్ల రోజురోజుకూ జీవననాణ్యత, విజ్ఞానం పెరగడంతో.. తల్లి సంరక్షణ అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి.  

మిసెస్ మామ్ 2020 గ్రాండ్ ఫినాలె కార్యక్రమానికి 93 రిజిస్ట్రేషన్లు రాగా, వాటిలోంచి 40 మంది గర్భిణులను ఎంచుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గౌర‌వ అతిథులుగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ గెడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

మిర్రర్స్ సెలూన్ సీఈవో  డాక్టర్ గూడపాటి విజయలక్ష్మి, ‘యాపిల్ హోం ఫర్ ఆర్ఫాన్ కిడ్స్’ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నీలిమా ఆర్య, ఒబెసిటీ, డయాబెటిస్ సర్జరీ చీఫ్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ దుక్కిపాటి నందకిషోర్, ద బర్త్ ప్లేస్ చీఫ్ గైనకాలజిస్టు డాక్టర్ ప్రతిభా నారాయణ్, ఫ్యాషన్ డిజైనర్ ఉప్పల మానసి, విశాఖ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేకానంద్, కార్డ్ లైఫ్ సైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ఉపమన్యు రాయ్ చౌధురి, సాషా లూక్స్ డెర్మటాలజీ సెంటర్ సీఈవో కాస్మెటిక్ డెర్మటాలజిస్టు డాక్టర్ ఎస్. నవ్య, సంతాన సాఫల్య నిపుణులు, రీప్రొడక్టివ్ ఎండోక్రినాలజిస్టు, గైనకాలజిస్టు డాక్టర్ రింకీ ఎస్.తివారీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.