హైదరాబాద్: మౌనిక ఆత్మహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.సికింద్రాబాదులోని తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో అదృశ్యమై మౌనిక హుస్సేన్ సాగర్ లో శవమై తేలింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

తొలుత ఆమె ముగ్గురు స్నేహితులను పోలీసులు విచారించి, వారికి సంబంధం లేదని తేల్చుకున్నారు. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా మౌనిక ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులే కారణమని తేలింది. ఇద్దరు బావలు, ఇద్దరు అన్నలు ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు. 

బుద్ధనగర్ చెందిన మాచర్ల అంచయ్య కూతురు మౌనిక మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్డీయట్ రెండో సంవత్సరం చదువుతోంది. గత నెల 21వ తేదీ ఉదయం కాలేజీకి వెళ్లిన మౌనిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె సోదరుడు సాయికుమార్ తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, 23వ తేదీన రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని హుస్సేన్ సాగర్ లో మౌనిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆ మృతదేహాన్ని కేసును దర్యాప్తు చేస్తున్న తుకారం గేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అయితే, తమ కూతురు ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని మృతదేహంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆత్మహత్యకు ముందు మౌనిక తన ముగ్గురు మిత్రులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు గుర్తించారు. ఆ యువకులను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించారు. అయితే, ఈ కేసుతో వారికి సంబంధం లేదని వారు నిర్ధారించుకున్నారు. 

ఆత్మహత్య చేసుకోవడానికి కొద్దిసేపటి ముందు మౌనిక తన మిత్రుడికి ఫోన్ చేసి బావలు, అన్నలు తనను వేధిస్తునారని, దాంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో ఆమె బావలు వడ్డే సోమశేఖర్, ఆంథోనీలను, అన్నలు శివకుమార్, సాయి కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. 

ఇద్దరు బావలు మౌనికను శారీరకంగా వేధించగా, అన్నలు మానసికంగా వేధించారని, ఆ కారణంగానే మౌనిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తేల్చారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.