హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి హరీష్ రావు మొదటిసారి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు భారీగా నిధులు కేటాయించారు. దీంతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ అమలుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయించారు. దీంతో హైదరాబాద్ ప్రజల తరపున ప్రభుత్వానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నగరం మరింత అభివృద్ది చెందుతోందన్నారు. ఆయన హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు అనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శమని మంత్రి కేటీఆర్ అన్నారు. 

read more  తెలంగాణ బడ్జెట్ 2020: హైలైట్స్

ఇక వైద్యరంగంలోనూ హైదరాబాద్ ప్రజల సంక్షేమం కోసం భారీ నిధులు కేటాయించారు. నగరంలో ఇప్పటికే 118 బస్తీ దవాఖానాలు వున్నాయని...వాటిని 350కి పెంచనున్నట్లు బడ్జెట్ లో పేర్కొన్నారు. అంటే మరో 232 బస్తీ దవాఖానాల ఏర్పాటు  చేసి నగరంలో నివసిస్తున్న పేదలకే మెరుగైన వైద్యసదుపాయం అందించనున్నట్లు పప్రభుత్వం ప్రకటించింది. 

 ప్రతీ డివిజన్‌లో కనీసం రెండు బస్తీ దవాఖానాలు వుండేలా చూస్తామని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, మైనారీటీలు, పేదలు ఉండే ప్రాంతాల్లో అదనపు దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ లో పేర్కొన్నారు. ఇలా హైదరాబాద్ అభివృద్దిపైనే కాదు ప్రజల సంక్షేమంపై కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి నిధులు కేటాయించింది.