హైదరాబాద్: హైదరాబాదులోని అమీర్ పేట వద్ద మెట్రో స్టేషన్ ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి వివాహిత మృత్యువాత పడింది. ఆమెను గోపు మౌనికగా గుర్తించారు. 

ఆమె కూకట్ పల్లిలో నివాసం ఉంటోంది. స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపాలపల్లె. భారీ వర్షం వస్తుండడంతో ఆమె తన వాహనాన్ని పక్కన నిలిపి మెట్రో స్టేషన్ వద్ద సోదరితో పాటు నిలుచుంంది. ఆ సమయంలో మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడిపడ్డాయి.

పెచ్చులు మీద పడడంతో తీవ్రంగా గాయపడిన మౌనిక అక్కడికక్కడే మరణించింది. చాలా ఎత్తు నుంచి పెచ్చులు మీద పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. రెండు నెలల క్రితమే మౌనిక వివాహమైంది. ఈ సంఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మౌనిక టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది.

ప్రమాదంపై మెట్రో యాజమాన్యం వివరణ ఇచ్చింది. 9 మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులూడిపడ్డాయని చెప్పింది. పదునైన పెచ్చులు మీదపడడంతో మౌనిక మరణించినట్లు తెలిపింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె చనిపోయినట్లు చెప్పింది.