హైదరాబాద్: తాను పుట్టిపెరిగిన లంబాడా సామాజికవర్గంలో అమ్మాయిలకు అస్సలు స్వేచ్చ వుండదని గాయని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. తాము నివసించే తండాల్లో అమ్మాలపైనే ఎక్కువగా ఆంక్షలు వుంటాయని... వాటిని దాటుకుని తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. తమ సమాజంలో ఎన్ని కట్టుబాట్లు వున్నా తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో వుందన్నారు. 

లంబాడా సమాజంలోని కట్టుబాట్ల, మూడ నమ్మకాల గురించి చెప్పుకుంటూ మంగ్లీ ఆవేధన వ్యక్తం చేశారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించి చంపేయడమే... ఇతరులకు అమ్మేయడమో చేయడం సర్వసాధారణంగా జరుగుతుందన్నారు. తన చిన్నప్పుడు ఇది మరింత ఎక్కువగా వుండేదని... ఆ పరిస్థితులన్నింటిని దాటుకుని తాను ఈ స్థాయిలో వుండటం చూసి గర్వంగా ఫీలవుతానని తెలిపారు.

ఇప్పటికీ తన అసలు పేరు చాలా మందికి తెలియదని... అందరికీ తాను మంగ్లీగానే పరిచయమన్నారు. అయితే తన అసలుపేరు మాత్రం సత్యవతి అని మంగ్లీ వెల్లడించారు. ఈ పేరుతో హైదరాబాద్ అడుగుపెట్టి మంగ్లీగా మారేంతవరకు చాలా కష్టాలు అనుభవించానని... వాటన్నింటిని తట్టుకుని నిలబడి ఇక్కడివరకు చేరుకున్నానని అన్నారు. 

బయట సమాజంలో కంటే లంబాడా  సామాజికవర్గంలో వయస్సులో వున్న యువతులపై ఆంక్షలు ఎక్కువగా వుంటాయని మంగ్లీ అన్నారు. గతంలో నోరు విప్పి మాట్లాడకూడదు... ఊరు దాటకూడదు ఇలా ఎన్నో రకాల ఆంక్షలు వుండేవని... ఇప్పుడిప్పుడే  అవన్ని తొలగిపోయి తాము కూడా మెరుగైన జీవనశైలిని అలవర్చుకుంటున్నట్లు తెలిపారు. అయితే కొన్ని మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఇంకా కట్టుబాట్లు అలాగే వున్నాయని మంగ్లీ వివరించారు.