హైదరాబాద్: భూకుంభకోణాలపై వీడియోలు పెట్టి, తెలంగాణ సర్కార్ ను ఇరుకున పెట్టిన మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.  దళిత సంఘాలు ఆయన అరెస్టు వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఓ పాత కేసును తవ్వితీసి ఆ కేసులో మల్లన్నను  జైలుకు పంపడానికి ప్లాన్ ఖరారైందని వారంటున్నారు. ఇందులో భాగంగానే మల్లన్న ఇంటి చుట్టూ పోలీసు బలగాల్ని దించారని చెబుతున్నారు.

తీన్మార్ మల్లన్నగా ప్రఖ్యాతి గాంచిన నవీన్ కుమార్ కెసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ వస్తున్నారు. ఓ తెలుగు టీవీ చానెల్ లో తీన్మార్ మల్లన్న పేరు మీద ఆయన ప్రోగ్రామ్ చేసేవారు. 

అయితే, తీన్మార్ అనే పేరు వాడుకోవద్దని ఆ టీవీ చానెల్ యాజమాన్యం ఆదేశించింది. దాంతో దాన్ని వాడుకోవడం మానేశారు. ఆ తర్వాత పలు టీవీ చానెళ్లలో ఆయన పనిచేశారు.