హైదరాబాద్: డిసెంబర్ 1న జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నగర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. 

ఆరేండ్ల కింద హైదరాబాద్ కు, ఇప్పటి హైదరాబాద్ కు ఎంతో పురోగతి ఉందన్నారు.  ఈ మహా నగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 గంటల కరెంటు, శాంతి భద్రతలు ఇవన్నీ సీఎం కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమయ్యాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగానే నగరంలో ఇంత గొప్పగా పాలన సాగుతోందని తెలిపారు. ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ ప్రజలపై ఉందన్న ఎమ్మెల్సీ కవిత.

హైదరాబాద్ నగరం వరుసగా ఐదేండ్లుగా ఇండియాలో బెస్ట్ సిటీగా ఉందని మర్సర్ వంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ర్యాంకులు, గొప్ప పరిస్థితులు కేవలం మాటలతో రావని...ఎంతో కష్టపడితే మాత్రమే సాధ్యమవుతాయన్నారు. హైదరాబాద్ లో ఇదే అభివృద్ధిని కొనసాగించేందుకు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా కల్వకుంట్ల కవిత కోరారు.