హైదరాబాద్ పుర ఎన్నికలు దగ్గరకి వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడానికి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమవంతు ప్రయాత్నాలు వాళ్లు చేస్తున్నారు. కాగా... ఈసారి హైదరాబాద్ మేయర్ గా ఓ మహిళ అధికారం చేపట్టనున్నది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ వివరాలను ఆదివారం అధికారికంగా తెలియజేశారు. 

జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. కాగా... మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నిక జరగనుంది. జీహెచ్ఎంసీ మేయర్ పోస్టుకి మహిళ కేటగిరీ రిజర్వ్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది తొలిసారి జరిగింది.

1965 లో తొలిసారిగా హైదరాబాద్ కి ఓ మహిళ మేయర్ గా పనిచేశారు. ఆ తర్వాత 2009లో జీహెచ్ఎంసీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన బండ కార్తీకా రెడ్డి మేయర్ గా విధులు నిర్వహించారు. 

గత ఎన్నికల్లో బీసీ కేటగిరికి రిజర్వ్ డ్ కాగా... టీఆర్ఎస్ పార్టీకి చెందిన బొంతు రామ్మోహన్ మేయర్ గా ఎన్నికయ్యారు. అత్యధిక మేజార్టీతో ఆయన గెలిచి... ఆ పదవిని చేపట్టారు. 

123 మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ స్థానాల్లో బీసీలకు 40, ఎస్సీలకు 17, ఎస్టీలకు 4 రిజర్వ్‌కాగా ఓపెన్‌ కేటగిరీకి 62 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకుగాను ఎస్సీ, ఎస్టీలకు చెరో స్థానం, బీసీలకు 4, ఓపెన్‌ కేటగిరీలో 7 స్థానాలు రిజర్వు అయ్యాయి. రాష్ట్రంలో కొత్త మున్సిపల్‌ చట్టం అమల్లోకి రావడంతో మళ్లీ కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. 

AlsoRead మున్సిపల్ ఎన్నికలు 2020: కేసీఆర్ కు బిజెపి భయం, కారణం ఇదీ.

త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలతోపాటు మరో రెండు పర్యాయాలు కలిపి మొత్తం మూడు వరుస సాధారణ ఎన్నికల్లో ఇవే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు కలిపి మొత్తం 141 పురపాలికలు ఉన్నాయి. ఇందులో షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఉన్న 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ జరపాల్సి ఉంది.

123 మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ స్థానాలకుగాను 61 స్థానాలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్ల చైర్మన్‌ స్థానాలకుగాను 6 స్థానాలు మహిళలకు లభించాయి. కొత్త మున్సిపల్‌ చట్ట నిబంధనల ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను వర్తింపజేశారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి ఆదివారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా 50 శాతం స్థానాలను ఎంపిక చేసి మహిళలకు రిజర్వు చేశారు. 

రిజర్వేషన్‌ కేటగిరీలవారీగా మహిళా రిజర్వేషన్లను పరిశీలిస్తే 123 చైర్‌పర్సన్‌ స్థానాల్లో బీసీ (జనరల్‌)కు 20, బీసీ (మహిళ)కు 20, ఎస్టీ (జనరల్‌)కు 2, ఎస్టీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్‌)కు 9, ఎస్సీ (మహిళ)కు 8, ఓపెన్‌ కేటగిరీ (జనరల్‌)కి 31, ఓపెన్‌ కేటగిరీ (మహిళ)కి 31 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకుగాను మహిళలకు 6 స్థానాలు దక్కాయి. 13 మేయర్‌ స్థానాలకుగాను బీసీ (జనరల్‌)కు 2, బీసీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్‌)కు 1, ఎస్టీ (జనరల్‌)కు 1, ఓపెన్‌ కేటగిరీ (జనరల్‌)కి 3, ఓపెన్‌ కేటగిరీ (మహిళ)కు 4 స్థానాలు రిజర్వు అయ్యాయి. కీలకమైన జీహెచ్‌ఎంసీ మేయర్‌ స్థానం ఓపెన్‌ కేటగిరీ(మహిళ)కి రిజర్వు కావడం గమనార్హం