ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ మీది నుండి జారిపడి కెనడాలో ఓ తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్‌, వనస్థలిపురం ఫేజ్-4కు చెందిన అఖిల్(19) టొరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నాడు.

కరోనా నేపథ్యంలో ఈ యేడు మార్చి 20న హైదరాబాద్‌కు వచ్చిన అఖిల్, అక్టోబర్ 5న తిరిగి కెనడా వెళ్లాడు. ఈ నెల 8న తను నివాసం ఉంటున్న బహుళ అంతస్తుల భవనంపై నుంచి జారిపడి మృతిచెందాడు. భవనం 27వ అంతస్తు బాల్కనీలో నిల్చుని ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. 

అఖిల్ మిత్రులు ఈ విషయాన్ని ఆయన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు. 

తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని మంత్రి కేటీఆర్‌కు అఖిల్ పేరెంట్స్ ట్విట్టర్ ద్వారా విన్నవించారు. దీంతో స్పందించిన మంత్రి.. అఖిల్ మృతదేహాన్ని నగరానికి రప్పించేందుకు హామీ ఇచ్చారని సమాచారం. అలాగే ఈ విషయమై అక్కడి భారత రాయబార అధికారులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.