హైదరాబాద్: కరోనాతో బాధపడుతూ భర్త మృతిచెందడాన్ని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలిన విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. భర్త మృతిచెందినట్లు తెలియగానే తట్టుకోలేక భార్య మేడపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లాకు చెందిన  తడకమల్ల వెంకటేష్, ధనలక్ష్మి భార్యాభర్తలు. వీరు ఉపాధినిమిత్తం హైదరాబాద్ కు వలసవెళ్లి ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వెంకటేష్ కూలీ పనికి వెళుతుండగా ధనలక్ష్మి ఓ సూపర్ మార్కెట్ లో పనిచేసేది. 

అయితే ఇటీవల వెంకటేష్ కరోనా బారినపడ్డాడు. దీంతో అతడు హోంక్వారంటైన్ లో వున్నాడు. అయితే గురువారం ఉదయం భర్తకు కావాల్సినవన్నీ సమకూర్చిన తర్వాత ధనలక్ష్మి డ్యూటీకి వెళ్లింది. కానీ మద్యాహ్నం సమయంలో అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృతిచెందాడు. సాయంత్రం సమయంలో డ్యూటీ పూర్తయిన వెంటనే ఇంటికి చేరుకున్న ఆమెకు భర్త మృతిచెంది కనిపించాడు. 

అతడి మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయిన ధనలక్ష్మి ఘోరమైన నిర్ణయం తీసుకుంది. వెంటనే తాము ఆద్దెకున్న ఇంటిపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా కరోనా కారణంగా భార్యాభర్తలిద్దరు ప్రాణాలు కోల్పోయారు.