హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోగంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రెండు గంటలపాటు రోడ్లపైకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

కాగా బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీంతో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.

మంగళవారం నాలుగు గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ వణికిపోయింది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో పాటు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తిరుమలగిరిలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాలానగర్ 5.5 సెం.మీ., మల్కాజ్‌గిరి 5.1 సెం.మీ., షేక్‌పేట 4.8 సెం.మీ., అసిఫ్‌నగర్ 4.5 సెం.మీ., వెస్ట్‌మారెడ్‌పల్లి 3.9 సెం.మీ., అల్వాల్ 3.5 సెం.మీ., శేరిలింగంపల్లి 3.1సెం.మీ., ఖైరతాబాద్‌లో 3 సెం.మీ. వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు