హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. ప్రజలు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. హయత్ నగర్, బేగంపేట, దిల్ షుక్ నగర్, కొత్తపేట, వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

ఉప్పల్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు హైదరాబాదులో పడుతున్నాయి. బయట ఉన్నవాళ్లు ఇళ్లకు చేరుకోవాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

సహాయక చర్యల కోసం హైదరాబాదులో 53 బోట్లను సిద్ధం చేశారు.  తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8 బోట్లను పంపించింది. హైదరాబాదులో దాదాపు 80 కాలనీలు నీటిలోనే ఉన్నాయని సోమవారం మంత్రి కెటీ రామారావు చెప్పారు తాజా వర్షాలతో ప్రజలు మరింతగా వణికిపోతున్నారు.  

ఎల్బీ నగర్, మీర్ పేట ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. చెట్ల కింద వాహనదారులు ఉండడం ప్రమాదకరమని చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు పడుతున్న వర్షాల వల్ల ప్రజలు పూర్తి స్తాయిలో సహాయం అందడం లేదు.  ఈ రోజు కుదుటపడుతుందని అనుకుంటున్న సమయంలోనే కొద్ది సేపట్లో మేఘాలు కమ్ముకుని వర్షాలు ప్రారంభమయ్యాయి. పది నిమిషాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. వరద పరిస్థితులపై మంత్రి కెటీఆర్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష జరుపుతున్న సమయంలోనే వర్షాలు ప్రారంభమయ్యాయి.

దాదాపుగా హైదరాబాదులోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.రోడ్ల మీద భారీగా నిలిచిపోతోంది. అధికారులు ముందుస్తుగానే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. ఇప్పటికే నీళ్లలో ఉన్న ప్రాంతాల ప్రజలు మరింత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. 

తెలంగాణ వరదలకు సంబంధించిన మరణాలు ఇప్పటి వరక 70 సంభవించాయి.