ఓ వైపు బల్దియా ఎన్నికల పోలింగ్ తో నగరం హీటెక్కితే.. మరోవైపు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని పారిశ్రామిక వాడ ఫేజ్‌ -4లో అగ్ని ప్రమాదం జరిగింది. 

జీడిమెట్ల ఫేజ్‌-4లోని హైటెక్‌ అలుకాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఈ రోజు ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా సెలవు దినం కావడంతో కార్మికులెవరూ లేరు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. 

అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో కంపెనీకి రావడంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్థి నష్టం జరిగి ఉండొచ్చని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనికి గల కారణాలు తెలుసుకునే పనిలో యాజమాన్యం పడిపోయింది.