ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కాపాడటం కోసం తపన పడ్డ ట్రాఫిక్ పోలీస్ బాబ్జీని  తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా అభినందించారు. హైదరాబాద్ అబిడ్స్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్‌ను బాబ్జీ ఆస్పత్రికి చేర్చిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిపోతుందన్నారు. 

‘‘పోలీసు డిపార్టమెంట్ గర్వంగా ఫీలయ్యే గొప్ప పనిచేశారని.. హ్యాట్సాఫ్ బాబ్జీ’’ అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. బుధవారం ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి చూపుతూ దాని ముందు పరిగెత్తిన బాబ్జీని పలువురు ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 

ఈ విషయంపై బాబ్జీ స్పందిస్తూ  డ్యూటీ సమయంలో బాధ్యతాయుతంగా పని చేస్తే ఇలాంటి ఫలితం వస్తుందన్నారు. అంబులెన్స్‌లో ఉన్నవారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే సేవ్ చేయాలని తానెప్పుడూ అనుకునే వాడినని.. తనకారోజున అదే దృశ్యం కనిపించిందని తెలిపారు. దీంతో వెంటనే అంబులెన్స్‌కు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. దయచేసి ప్రతి ఒక్కరూ అంబులెన్స్‌కి దారి ఇవ్వాలని, విలువైన ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలావుంటే, బాబ్జీని హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అభినందించారు. బాబ్జీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పోలీసులు మానవత్వంతో పనిచేయాలని అంజనీ కుమార్ సూచించారు.