హైదరాబాద్: ఓ యువతి చిత్తుగా తాగేసి పోలీసులను దుర్భాషలాడింది. దాంతో ఆగకుండా ఓ కానిస్టేబుల్ చేయి కొరికింది. ఈ సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ యువతిపై పోలీసులు కేసు మోదు చేశారు. 

బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 10 జహీరానగర్ సమీపంలో మూడు రోజుల క్రితం ఆ సంఘటన జరిగింది. ఓ యువతి మద్యం మత్తులో ఉందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

మహిళా ఎస్ఐ జి. వాసవి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. మత్తులో ఉన్న యువతి పారిపోయేందుకు ప్రయత్నించింది. పోలీసులు పట్టుకోగలిగారు. దాంతో పోలీసులను ఆ యువతి దుర్భాషలాడింది. 

గంటపాటు ఆ యువతి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. స్టేషన్ కు తీసుకుని వెళ్లిన తర్వాత కూడా హంగామా సృష్టించింది. ఎస్ఐని తోసేయడంతో పాటు కానిస్టేబుల్ చేయి కొరికింది. మత్తు వదిలేంత వరకు యువతిని రెస్క్యూ హోంలో ఉంచారు. 

యువతి గురించి పోలీసులు వాకబు చేశారు. నాగాలాండ్ కు చెందిన వై. రూడీ సంగ్తం అలియాస్ లిసాగా ఆమెను గుర్తించారు. ఓ మసాజ్ సెంటర్ లో పనిచేస్తున్న యువతి మద్యం మితిమీరి సేవించడం వల్ల అలా వ్యవహరించిననట్లు తేలింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు, నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు ఆణెపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.