బల్దియా ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. నగరపాలక ఎన్నికలకోసం జాతీయ పార్టీలు తమ అగ్ర నాయకులను రంగంలోకి దింపుతున్నాయి. శనివారం గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో గ్రేటర్ హీటెక్కనుంది. 

ఇప్పటికే దుబ్బాక విజయంతో జోష్ లో ఉన్న బీజేపీ గ్రేటర్‌లో సత్తా చాటాలని బల్దియాలో పాగా వేయాలని చూస్తోంది. దీంట్లో భాగంగానే.. బీజేపీ అగ్రనేతలను ప్రచారానికి రప్పిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు గ్రేటర్‌ ప్రచారంలో పాల్గొననున్నారు. 

గ్రేటర్ ఎన్నికల్లో  ప్రచారానికి బీజేపీ అగ్రనేతలతో పాటు.. కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు కూడా వస్తున్నారు.. ఇప్పటికే.. తమ తమ రాష్ట్రాల నుండి కార్యకర్తలను తీసుకొచ్చిన విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

రేపు హైదరాబాద్ కు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ రానున్నారు. రేపు సాయంత్రం 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న యోగీ ఆదిత్య్నాద్ మల్కాజ్‌గిరి పార్లమెంటు, పాతబస్తీలో రోడ్ షో చేయనున్నట్లు చెబుతున్నారు. 

మధ్యాహ్నం 3 గంటలకు  జీడిమెట్ల ఉషా ముళ్ళపూడి ఆసుపత్రి నుంచి 5 గంటల వరకు ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రోడ్ షో ఉండనుందని సమాచారం. సాయంత్రం 6 గంటల నుంచి పాతబస్తీలోని శాలిబండ, లాల్ దర్వాజలో పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొననున్నారు యోగీ ఆదిత్యానాథ్. రాత్రి 8.30కు బేగంపేట నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు యోగీ.