భువనగిరి: యాదాద్రి భువనగిరి  జిల్లాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ప్రాణంకంటే ఎక్కువగా భావించే  భూమి ఎక్కడ దూరమవుతుందోనన్న బాధతో అన్నదాత  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకుని వేధించడం వల్లే ఆయన ప్రాణత్యాగానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా నారాయణ నారాయణపురం మండలం అరేగుడెంలో కాశయ్య అనే రైతుకు కొంత భూమి వుంది. అయితే ఈ భూమికి సంబంధించిన వివాదంలో స్థానిక పోలీసులు తలదూర్చారు. వారు ఈ భూమి విషయంలో నిత్యం కాశయ్యను వేధించడం ప్రారంభించారు. 

గత కొద్ది రోజులుగా నారాయణపురం ఎస్సై నాగరాజు, ఏఎస్సై శ్యామ్ సుందర్ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఇలా మంగళవారం కూడా శ్యామ్ సుందర్ నలుగురు కానిస్టేబుళ్లతో కలిసి కాశయ్య పొలం దగ్గరకు వెళ్లి బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర  ఆందోళనకు లోనయిన అతడు అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ముందుగా స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన వైద్యం కావాలని చెప్పడంతో హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ అమ్మ ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం అతడి పరిస్థితి విషయంగానే వున్నట్లు సమాచారం.