హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు చెందిన మహిళ (35)కు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. వారికి ఉద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం ఆమె భర్తతో గొడవ పడింది. దాంతో భర్త దూరంగా ఉంటూ వచ్చింది. 

రెండు నెలల క్రితం హైదరాబాదులోని రాజేంద్ర నగర్ లో ఓ  గదిని అద్దెకు తీసుకుని పిల్లలతో కలిసి ఉంటుంది. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని బ్లూకోట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు తలుపులు పగులగొట్టి చూడగా ఆమె శవం రక్తం మడుగులో కనిపించింది. 

రాజేంద్ర నగర్ ఇన్ స్పెక్టర్ జి. సురేష్, ఎస్ఐ వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఓ వ్యక్తితో పరిచయం ఉందని తెలుస్తోంది. అతను తరుచుగా ఆమె ఇంటికి వచ్చేవాడని చెబుతున్నారు. 

మూడు రోజుల క్రితం ఆమె తన కూతుళ్లను పాఠశాలకు పంపించింది. వారిని పాఠశాలకు పంపించే సమయంలో ఆ వ్యక్తి కూడా ఇంట్లోనే ఉన్నాడని అంటున్నారు. ఆ మహిళను అతనే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత తాళం వేసి పారిపోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.