హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంధువులమంటూ హైదరాబాద్ లో ఓ గ్యాంగ్ నానా హంగామా సృష్టించింది. నడిరోడ్డుపై మద్యాన్ని సేవిస్తూ ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా తాము కేటీఆర్ బంధువులమంటూ బెదిరిస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ ఎల్బీనగర్ లోని సితార ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చిన కొందరు రోడ్డుపైనే మద్యం సేవించడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా రోడ్డుపక్కనున్న ఆటోలు, ఇతర వాహనాలపై బాటిల్స్ పెట్టి తాగసాగారు. దీంతో ఇదేంటని ప్రశ్నించిన స్థానికులు, ఆటోడ్రైవర్లపై దాడికి పాల్పడ్డారు. తాము మంత్రి కేటీఆర్ బంధువులమని... పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం చేయలేరంటూ బెదిరింపులకు దిగారు. 

ఇలా వారి చేతిలో దాడికి గురయిన వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ హంగామాకు కారణమైన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఫంక్షన్ హాల్‌కు చుట్టుపక్కలున్న సీసీ టీవీ ఫుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.