హెర్బల్ ఆయిల్ వ్యాపారంతో లాభాలు గడించొచ్చన వ్యాపారి ఆశను సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. ఏకంగా 52 లక్షలకు కుచ్చుటోపీ వేశారు. మోసపోయనని తెలుసుకునేసరికి నూనె పెట్టుకోవడానికి లేకుండా జుట్టుకూడా ఊడిపోయేంత టెన్షన్ లో మునిగిపోయాడు.

హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ఓ వ్యాపారికి హెర్బల్ ఆయిల్ మర్చంట్లమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. హెర్బల్ ఆయిల్ పేరతో 52లక్షల రూపాయలకు దండుకున్నారు. ఈ వ్యవహారమంతా మణిపూర్ కేంద్రంగా సాగిందని బాధితుడు తెలిపారు. 

పోలీసుల కథనం ప్రకారం.. అమీర్ పేటకు చెందిన వ్యాపారికి హెర్బల్ ఆయిల్ సరఫరా చేస్తామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు రూ. 52 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వారి మాటలు గుడ్డిగా నమ్మిన వ్యాపారి ఆ డబ్బును వారికి పంపించాడు. 

డబ్బు పంపిన తరువాత ఎంతకూ హెర్బల్ ఆయిల్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వ్యాపారి ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు.