విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుధపూజ నిర్వహించారు. సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో సతీమణి శోభతో కలిసి కేసీఆర్ వాహనపూజ, ఆయుధపూజ నిర్వహించారు.

అనంతరం ప్రగతిభవన్‌ ప్రాంగణంలోని నల్లపోచమ్మ దేవాలయంలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం పూజలు చేశారు. అనంతరం పాలపిట్ల దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దసరా అన్నారు. ఈ పండుగ ప్రజల జీవితాలలో కొత్త వెలుగులను నింపాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం తనయుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు, కుమార్తె కవిత ఇతర కుటుంబసభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.