హైదారబాద్‌: ఓ మహిళ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరు చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది. ఇంటి బయటకు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు భీభత్సం స్రుష్టించింది. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. 

పాతబస్తీలోని మిశ్రీగంజ్‌లో ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటుండగా వారిపైకి ఓ కారు దూసుకొచ్చింది. ఓ మహిళ నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేస్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యింది. కారు కింద పడి ఓ చిన్నారి రెండు కాళ్లు విరిగిపోయాయి. అయితే ఈ ప్రమాదం నుండి మరో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. గాయపడిన బాలున్ని కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ప్రమాదానికి కారణమైన మహిళ ఇటీవలే యూఏఈ నుండి వచ్చినట్లు తెలుస్తోంది. కారును రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.