హైదరాబాద్:  నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేలమీదకు దించడం ఖాయమని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆయన అల్లుడు హరీష్  రావును దుబ్బాకలో, కొడుకు కేటీఆర్ ను హైదరాబాద్ లో  ఓడించి నేలమీదకు తీసుకువచ్చామని... అదేపని నాగార్జునసాగర్ లో చేసి కేసీఆర్ భరతం పడతామన్నారు. బావ, బావమరిది పని అయిపోయిందని... ఇక కేసీఆర్ ఒక్కరే మిగిలారని అన్నారు. 

శనివారం జిహెచ్ఎంసి ఎన్నికల్లో అత్తాపూర్ డివిజన్ లో గెలుపొందిన బిజెపి అభ్యర్థి మోండ్ర సంగీత విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రఘునందన్ రావు పాల్గొని ప్రసంగించారు. 

నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ ను అదే సాగర్ లో ముంచితే ఆంధ్రాలో తేలడం ఖాయమని రఘునందన్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశ రాజధాని డిల్లీకి వెళ్లిన కేసీఆర్ కేంద్ర మంత్రులకు వంగి వంగి సలాంలు పెడుతున్నది గులాంగిరీ చేయడానికేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేంద్రం తల వంచుతామన్న కేసీఆర్ డిల్లీలో మాత్రం దండాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారని అన్నారు. 

బీజేపీ కార్పొరేటర్లు ప్రజలకు సేవకులుగా పనిచేయాలని  రఘునందన్ సూచించారు. నాగార్జున్‌సాగర్‌ ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ను ఎన్నుకునే దమ్ము ధైర్యం టీఆర్‌ఎ్‌సకు ఉందో లేదో తెలియదన్నారు.