తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఆర్ట్ వర్క్ షాప్ బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ ఆర్ట్ వర్క్ షాప్ లో మహిళా చిత్రకారిణులు 50 మంది పాల్గొంటున్నారు.

ఈ రోజు జరిగిన ఆర్ట్ వర్క్ షాప్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా టీన్యూస్ సీయీఓ శ్రీ నారాయణ రెడ్డి గారు పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి క్యాంపు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలం నుండి బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమ అస్తిత్వ కేంద్రంగా కొనసాగించడంలో తెలంగాణ జాగృతి తో పాటు టీన్యూస్ కలసి నడిచిందని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ జాగృతి తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సహకారంతో నిర్వహిస్తున్న ఆర్ట్ క్యాంపును ప్రముఖ చిత్రకారులు రమణారెడ్డి సమన్వయం చేస్తున్నారు. అనిత క్యూరేటర్ గా వ్యవహరిస్తున్నారు. 

కేవలం మహిళలతో నిర్వహించిన 50 మంది చిత్రకారిణుల తొలి ఆర్ట్ క్యాంపు ఇదని నిర్వాహకులు తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం అధ్యక్షులు రమణారెడ్డి మీడియాతో తెలిపారు.

ఈ సందర్భంగా 50 మంది చిత్రకారిణులు ఒకే సారి కాన్వాస్ పై తెలంగాణ ఆత్మను ఆవిష్కరించడం అద్భుతమైన దృశ్యంగా ఉందని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అన్నారు. సహజంగానే సృజనశీలురైన మహిళలు బతుకమ్మకోసం కుంచె పట్టడం సంతోషంగా ఉందనీ అన్నారు.

ఆడబిడ్డలంతా ఒక చోట చేరి ఆడి పాడే అందమైన పండుగ బతుకమ్మ అని ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిత్రకారిణులు పాల్గొన్నారు.