ఆటో నడుపుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బేంగపేట పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఆటోలో ప్రయాణికుల్లా ఎక్కి మిగతావారి దగ్గరినుండి సెల్ ఫోన్లు, డబ్బులు దొంగతనం చేస్తుంది ఈ ముఠా. ఆటో ఓనర్ కూడా ఈ ముఠా సభ్యుడే.

వీరి నుంచి రూ. 5 లక్షల విలువైన 22 ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాకుత్‌పురాకు చెందిన మహ్మద్‌ యూనస్‌(30) ఆటోడ్రైవర్‌. ఇతడిపై ఇప్పటికే పలు నేరాల్లో నిందితుడిగా 11 కేసులు ఉండడంతో రెయిన్‌బజార్‌ పోలీసులు రౌడీషీట్‌ నమోదు చేశారు. 

యూనస్ రెయిన్‌బజార్‌కు చెందిన ఆటోడ్రైవర్లు అబ్దుల్లా మెయినుద్దీన్‌(26), మహ్మద్‌ అమీర్‌(24), సయ్యద్‌ సల్మాన్‌(27), యాకుత్‌పురాకు చెందిన సయ్యద్‌ మహ్మద్‌(50)తో యూనస్‌ ముఠా ఏర్పాటు చేశాడు. ఇలా దొంగిలించిన సొత్తును జగదీషా మార్కెట్లో షాప్ నడుపుతున్న అబ్దుల్ సోహైల్ కొనేవాడు. ప్రయాణికులను దోచుకునేందుకు అబ్దుల్లా తన ఆటో ఉపయోగించేవాడు. మిగిలిన వారు ప్రయాణికుల్లా నటించేవారు. 

ఈ ముఠాపై బేగంపేట, గోపాలపురం, చిలకలగూడ, మీర్‌చౌక్‌ పోలీస్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించి పట్టుకున్నారు. నిందితులతోపాటు, స్వాధీనం చేసుకున్న ఫోన్లను బేగంపేట పోలీసులకు అప్పగించారు.