న్యూఢిల్లీ : దేశమంతా ఒకే భాష ఉండాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు అందరికీ తెలిసిన భాష ఒకటి ఉండాలని అందుకు రాజభాష అయిన హిందీయే కరెక్టు అన్న అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న అమిత్ షా వ్యాఖ్యలు సరికాదన్నారు. దేశమంటే కేవలం హిందీ, హిందూ, హిందుత్వ కాదన్నారు. వాటన్నింటి కంటే భారత్‌ ఎంతో విశాలమైందని చెప్పుకొచ్చారు. 

అమిత్ షా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ భారతీయులందరి మాతృభాష హిందీ కాదని చెప్పుకొచ్చారు. భరతభూమిపై ఎన్నెన్నో మాతృభాషలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ భాషలన్నింటిలోని భిన్నత్వాన్ని అందాన్ని తెలుసుకునేందుకు కాస్త ప్రయత్నించండి అంటూ సలహా ఇచ్చారు. 

భారత రాజ్యాంగంలోని 29వ అధికరణ ప్రకారం ప్రతీ ఒక్కరికీ నచ్చే భాష, వారి సంస్కృతీ సంప్రదాయాల స్వేచ్ఛ కల్పించిందని చెప్పుకొచ్చారు. తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతీ సంప్రదాయాలు పాటించేందుకు ఆర్టికల్ 29 అవకాశం కల్పించిందని చెప్పుకొచ్చారు. హిందీ, హిందూ, హిందుత్వ కంటే ఇండియా చాలా పెద్దది అంటూ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. 

 

ఇకపోతే శనివారం హిందీ సందర్భంగా అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యంగా  ఉంచడానికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు.

 ప్రపంచంలో భారత్‌ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత వచ్చిందన్నారు. ఈరోజు దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమేనన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ, వల్లభబాయ్‌ పటేల్‌ ఆశయాలను నెరవేర్చాలంటే మాతృభాషతో పాటు హిందీ భాష వాడకాన్ని పెంచాలి అని అమిత్ షా భారత ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.