హైదరాబాద్: మురికి కాలువలో మనిషి కాలు కొట్టుకువచ్చిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఇలా మానవ శరీర అవయవం కనిపించడంతో సైదాబాద్ ప్రాంతంలో కలకలం రేగింది.  

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలోని నాలాలన్ని పొంగి పొర్లుతున్నారు. ఈ క్రమంలోనే భారీ వర్షపునీటితో పొంగిపొర్లుతున్న చంపాపేటలోని ఓ నాలాలో మోకాలి వరకు వున్న ఓ మనిషి కాలు కొట్టుకువచ్చింది. నీటిపై తేలుతూ వున్న ఆ కాలిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 

read more  నేరెడ్‌మెట్‌ నాలాలో బాలిక మృతి: జీహెచ్ఎంసీ అధికారులపై తల్లిదండ్రుల ఫిర్యాదు

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ కాలిని కాలువలోంచి తీయించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ నిర్వాకానికి ప్రైవేట్ హాస్పిటల్స్  నిర్లక్ష్యమే కారణమై వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శస్త్రచికిత్స ద్వారా తొలగించిన కాలు ఇలా కాలువలో కొట్టుకువచ్చి వుంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.