హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని చందానగర్ లో నలుగురు వ్యక్తులు రూ.80 లక్షల విలువ చేసే సిగరెట్లను దొంగిలించిన విషయం వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం ఈ చోరీ జరిగింది. మహారాష్ట్రలోని నాందేడుకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 

సైబరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.... వస్త్రవ్యాపారి సంజయ్ పుండలిక్ ధుమాలే సిగరెట్ల చోరీకి పథక రచన చేశఆడు. తన వాహనం కోసం తీసుకున్న రుణం చెల్లించడానికి ఈ పథక రచన చేసి అమలు చేశాడు. ఆరుగురు అనుచరుల సాయం తీసుకుని దాన్ని అమలు చేశాడు. 

ప్రధాన నిందితుడు సంజయ్ తో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దొంగిలించిన 59 సిగరెట్ కార్టన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ కోసం వాడిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు 

సంజయ్ ఇటీవల మినీ అశోక్ లైలాండ్ కొన్నాడు. తగిన ఆదాయం లేకపోవడంతో వాయిదాలు చెల్లించలేకపోయాడు. దాని నుంచి బయటపడడానికి తన అనుచరులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు.

ఓ ఫ్యాక్టరీని లేదా కంపెనీని ఎంపిక చేసుకోవడానికి సంజయ్ చోరీ చేయడానికి వారం రోజుల ముందు హైదరాబాదుకు వచ్చాడు. పద్మజా కాలనీలో డీసీఎం నుంచి సిగరెట్ కార్టన్స్ ను దింపుతున్న విషయాన్ని గమనించాడు. 

జనవరి 2వ తేదీన ఆరుగురు నిందితులు సీసీటీవీ కెమెరాలను డిస్ కనెక్ట్ చేసి గోడౌన్ గ్రిల్స్ లాక్ లను పగులగొట్టి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. నిందితుల్లో సంజయ్, నామ్ దేవ్ శంభాజీ ముండే, రాథోడ్ రాజేభౌ బాబు, గోపాల్ పురుషోత్తమ్ దాలియా నాందేడ్ కు చెందినవారు కాగా, కాశీనాథ్ కదం, రాజు ఎంజ్వాడే, దిగంబర్ ధూమారే పరారీలో ఉన్నారు.