స్నేహితుడి గదిలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని చనిపోవడం రాజేంద్రనగర్ లో కలకలం రేపింది. మెహదీపట్నంలోని శ్రీ గాయత్రీ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న ప్రవీణ కుటుంబం పాండురంగానగర్ లో ఉంటారు. శుక్రవారం నాడు స్నేహితురాలి నిశ్చితార్థం ఉందని ఇంట్లోవారికి చెప్పి రాజేంద్రనగర్ లోని హైదర్ గూడలో ఉంటున్న తన స్నేహితుని రూం కి వచ్చింది. 

ప్రవీణ (19) తండ్రి నర్సింహా సెంట్రింగ్‌ పని చేస్తాడు. ప్రవీణ ఖో-ఖో క్రీడాకారిణి. స్కూల్‌ స్థాయిలో ఉన్నప్పుడు బడిలోని కోచ్‌ ప్రభాకర్‌ ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఈ క్రమంలో ఆమెకు ప్రభాకర్‌ స్నేహితుడు, 
తరువాత తాండూరుకు చెందిన శ్రీకాంత్‌ తో ఏర్పడిని పరిచయం ప్రేమగా మారింది. శ్రీకాంత్‌, హైదర్‌గూడలో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. అప్పుడప్పుడూ ప్రవీణ.. శ్రీకాంత్‌ కోసం గదికి వచ్చివెళ్లేది.. గురువారం శ్రీకాంత్‌ తాండూరులో ఉండగా అది తెలియని ప్రవీణ.. అతడి గదికి వెళ్లింది. శ్రీకాంత్‌ లేకపోవడంతో అతడికి ఫోన్‌ చేసింది.

ఫోన్‌ సంభాషణలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ రోజు రాత్రి 9గంటలకు  శ్రీకాంత్‌ తన గదికి వచ్చేసరికి ప్రవీణ  సీలింగ్‌ ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకుని కనిపించింది. శ్రీకాంత్ వెంటనే రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో సమాచారమిచ్చాడు.

అంతకుముందే స్నేహితురాలి నిశ్చితర్థం అంటూ వెళ్లిన ప్రవీణ సాయంత్రం దాకా రాకపోవడంతో ఆమె తండ్రి, స్నేహితురాళ్ల దగ్గర వాకబు చేశాడు. ఫలితం లేకపోవడంతో రాత్రి రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కూతురు ప్రవీణ ఇక లేదని తెలిసి ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు.