రాత్రిళ్లు విపరీతంగా చెమటలు పడుతున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టేనంటున్నారు నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట చెమటలు క్షయవ్యాధికి సంకేతం కావొచ్చు.  

ఏటా మార్చి 24న.. ప్రభుత్వం, కార్యకర్తలు, సెలబ్రిటీలు క్షయ వ్యాధిపై అవగాహన కల్పిస్తుంటారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ టీబీ దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి ఏడాది కనీసం 10 మిలియన్ల మంది ప్రజలు టీబీ బారిన పడుతున్నారు. ఇది నయం చేయగల, నివారించదగిన వ్యాధి. కానీ దీనిపై అవగాహన లేక ఎంతో మంది దీనితో చనిపోతున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది క్షయవ్యాధితో మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్షయవ్యాధి ఉన్నవారు సగం మంది భారతదేశంతో సహా ఇంకా ఎనిమిది దేశాలలో ఉన్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

అంటువ్యాధి అయిన క్షయవ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల వస్తుంది. టీబీ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఇది గాలి ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కలుషితమైన సూదులను పంచుకోవడం ద్వారా లేదా సెక్స్ ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది.

రాత్రి చెమటలు క్షయవ్యాధికి సంకేతం

రాత్రిపూట చెమటలు పట్టడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ ఇది క్షయవ్యాధికి సంకేతం కావొచ్చు. ముఖ్యంగా రాత్రిపూట చెమటలు పట్టడంతో పాటు బరువు తగ్గడం, దగ్గు, జ్వరం వంటి ఇతర లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందేనంటున్నారు నిపుణులు. ఉన్నపాటుగా బరువు తగ్గితే సంతోషించకండి. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన రోగాలకు సంకేతం కావొచ్చు. క్షయవ్యాధి ఉంటే రాత్రిపూట చెమటలు, పగటిపూట చెమటలు కంటే భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి మీరు నిద్రపోతున్నప్పుడు వస్తాయి. ఈ చెమటల వల్ల బట్టలు, కింద పరుపు కూడా తడిసిపోతాయి. 

క్షయవ్యాధి ఇతర సాధారణ లక్షణాలు 

  • కఫంతో కూడిన దగ్గు, కొన్నిసార్లు రక్తంతో కూడా పడొచ్చు
  • ఛాతీ నొప్పులు
  • బలహీనత

ఎవరికి ప్రమాదం ఉంది?

మహిళలకే టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. నిరంతర దగ్గు, జ్వరం, రాత్రి చెమటలు, బరువు తగ్గడం లేదా అలసట వంటి లక్షణాలను లైట్ తీసుకోకూడదు. ఇవి మీలో కనిపించిన వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. చెకప్ లు చేయించుకోండి. ఎందుకంటే ఇవి క్షయవ్యాధి సంకేతాలు కావొచ్చు. మహిళలకు ప్రత్యేకమైన ఇతర లక్షణాలు.. కటి నొప్పి లేదా అసాధారణ యోని ఉత్సర్గను కలిగి ఉండొచ్చు.

హెచ్ఐవి, పోషకాహార లోపం లేదా డయాబెటిస్ వంటి బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి టీబీ వచ్చే ప్రమాదం ఉంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. క్షయ, హెచ్ఐవి ప్రాణాంతక కలయిక. రెండు సంవత్సరాల కిందట హెచ్ఐవి సంబంధిత క్షయవ్యాధితో 1,86,000 మందికి పైగా మరణించారు.

హెచ్ఐవి సోకిన వ్యక్తులతో పాటు, రద్దీగా లేదా సరిగా గాలి వెలుతురు లేని వాతావరణంలో నివసించేవారికి, పొగాకు లేదా ఆల్కహాల్ ను ఉపయోగించే వారికి కూడా టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.