బొప్పాయిని తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. అంతేకాదు ఇది గుండెకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీని ప్రయోజనాలను పొందడానికి ఈ పండును ఇలాగే తినాల్సి ఉంటుంది.
బొప్పాయిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. బొప్పాయి ఎన్నో ముఖ్యమైన పోషకాల భాండాగారం. ఇవి మన మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందుకోసం ఈ పండును సరైన సమయం, మార్గంలోనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే బొప్పాయి మన ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడమే కాదు.. ముఖానికి అప్లై చేయడం వల్ల ఎన్నో చర్మ సమస్యలు తొలగిపోతాయి. అందుకే ఈ పండును ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. బొప్పాయి మన ఆరోగ్యానికి చేసే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. బొప్పాయిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 9, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం, విటమిన్ బి 1, విటమిన్ బి 3, విటమిన్ బి 5, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి పోషకాలు కూడా ఈ పండులో ఉంటాయి. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఈ పండులో ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని కెరోటినాయిడ్లు అని పిలుస్తారు.
గుండెకు మేలు
పబ్ మెడ్ సెంట్రల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. బొప్పాయిలో లైకోపీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
జీర్ణక్రియను బలోపేతం చేస్తుంది
బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్లు ప్రోటీన్లు సులవుగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. అంతేకాదు మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మలబద్ధకం, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని తింటే సమస్య చాలా తొందరగా నయం అయింది. బొప్పాయి పండే కాదు దాని విత్తనాలు కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటాయి.
చర్మాన్ని అందంగా చేస్తుంది
బొప్పాయి శారీరక ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు.. చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని పేస్ట్ చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. బొప్పాయి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే చర్మ నష్టాన్ని తగ్గిస్తుంది. అలాగే ముడతలు, మచ్చలు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, లైకోపీన్ అకాల వృద్ధాప్యం నుంచి మీ చర్మాన్ని రక్షిస్తాయి.
ఎముకలను బలంగా చేస్తుంది
మన శరీరంలో విటమిన్ కె లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. అంతేకాదు దీని వల్ల ఎముక పగుళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే బొప్పాయిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. బలహీనమైన ఎముకలు ఉన్నవారు ఈ పండును తింటే వారి రీరంలో కాల్షియం శోషణ పెరుగుతుంది. దీని వల్ల మీ శరీరంలో క్యాల్షియం తగినంత మోతాదులో ఉండి ఎముకలు దృఢంగా ఉంటాయి.
బొప్పాయి తినడానికి సరైన సమయం ఏది?
బొప్పాయిని ఉదయాన్నే పరగడుపున తింటే మంచిది. ఇది రోజంతా మీ కడుపును, జీర్ణవ్యవస్థను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండు మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. అయితే ఈ పండును మీరు రాత్రిపూట కూడా తినొచ్చు. ఎందుకంటే ఇది పేగులను నిర్విషీకరణ చేస్తుంది. కానీ తిన్న తర్వాత కనీసం 3 నుంచి 4 గంటలు ఎలాంటి పండ్లు తినకూడదని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఈ పండును రాత్రి పూట తినాలనుకుంటే లిమిట్ లోనే తినండి.
బొప్పాయి తిన్న వెంటనే నీరు తాగకూడదు
బొప్పాయి తిన్న వెంటనే నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా తాగితే మీ జీర్ణవ్యవస్థకు హానికలుగుతుంది. దీనివల్ల డయేరియా, విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
