Asianet News TeluguAsianet News Telugu

సైలెంట్ హార్ట్ ఎటాక్.. ఇది ఎందుకు వస్తుంది.. దీన్ని ఎలా తగ్గించుకోవాలి?

సైలెంట్ హార్ట్ ఎటాక్ ప్రాణాంతక ఆరోగ్య సమస్య. ఇది గుండె కండాల శాశ్వత నష్టానికి దారితీస్తుంది. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకుంటే ఈ నిశ్శబ్ద గుండెపోటును తగ్గించుకోవచ్చు. 
 

What Is a Silent Heart Attack? what are the risk factors and how to prevent
Author
First Published Mar 18, 2023, 7:15 AM IST

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు మరణానికి ప్రధాన కారణమైన గుండె జబ్బులతో చాలా మంది బాధపడుతున్నారు. గుండె కండరానికి శాశ్వత నష్టం కలిగించే సైలెంట్ హార్ట్ ఎటాక్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి నిశ్శబ్ద గుండెపోటును నివారించడానికి దాని ప్రమాద కారకాలను గుర్తించడం చాలా అవసరం. జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకుంటే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి?

నిశ్శబ్ద గుండెపోటును సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (ఎస్ఎమ్ఐ) అని కూడా పిలుస్తారు. ఇది సాధారణ లక్షణాలు లేకుండా సంభవించే గుండెపోటు. ఈ లక్షణాలలో ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, చెమట పడట్టం వంటివి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి తనకు గుండెపోటు వచ్చిందని కూడా గ్రహించలేకపోతాడు. ఇది ప్రమాదకరం. ఎందుకంటే చికిత్స లేకుండా హార్ట్ ఎటాక్ నుంచి ప్రాణాలతో బటయపడలేం. సైలెంట్ హార్ట్ ఎటాక్ గుండె కండరాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.

నిశ్శబ్ద గుండెపోటుకు ప్రమాద కారకాలు:  అనేక ప్రమాద కారకాలు నిశ్శబ్ద గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతాయి. వీటిలో..

వయసు: వయస్సు మీద పడుతున్న కొద్దీ గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

కుటుంబ చరిత్ర: మీ కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వస్తే.. మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 

ధూమపానం: స్మోకింగ్ రక్త నాళాలు దెబ్బతినడానికి దారితీస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

అధిక రక్తపోటు: అధిక రక్తపోటు గుండెను దెబ్బతీస్తుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

అధిక కొలెస్ట్రాల్: రక్తంలో ఎక్కువ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉంటే ధమనుల్లో అడ్డంకులు కలిగిస్తుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది.

డయాబెటిస్: డయాబెటిస్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే డయాబెటీస్ రక్త నాళాలను దెబ్బతీస్తుంది.

ఊబకాయం: అధిక బరువు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

నిశ్చల జీవనశైలి: ఎక్కువసేపు ఒకేదగ్గర కూర్చోవడం లేదా శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవనశైలి అలవాట్లు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతాయి.

సైలెంట్ హార్ట్ ఎటాక్ నివారణ

సైలెంట్ హార్ట్ ఎటాక్ ను నివారించడానికి స్మోకింగ్ ను మానేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇవన్నీ మిమ్మల్ని గుండెపోటుకు దూరంగా ఉంచుతాయి.

ఒకవేళ మీకు సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చిందనిపిస్తే  వైద్యుడితో మాట్లాడండి. మీకు గుండెపోటు ఉందో లేదో తెలుసుకోవడానికి, అవసరమైన చికిత్సను అందించడానికి అవసరమైన పరీక్షలు చేస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios