ఎండాకాలం షురూ అయ్యింది. మండుతున్న ఎండలకు గొంతు తరచుగా ఎండిపోతూ ఉంటుంది. ఇంకేముంది నీళ్లను, ఇతర పానీయాలను తాగుతూ దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాం. అయితే ఈ సీజన్ లో తాగే కొన్ని పానీయాలతో సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే
దోసకాయ నీరు
దోసకాయ వాటర్ మనల్ని చల్లగా ఉంచుతుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఎండాకాలంలో రీఫ్రెషింగ్ డ్రింగ్ ను తాగాలనుకుంటే ఒక గ్లాసు కీరదోసకాయ నీళ్లను తాగడం మంచిది.
కీరదోసకాయ వాటర్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే పోషణను పెంచుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఈ సీజన్ లో కీరదోసకాయ వాటర్ ను తాగండి. దీనికోసం కొన్ని కీరదోసకాయలను తీసుకుని వాటి తొక్కలు తీయండి. తర్వాత దోసకాయలను ముక్కలుగా కట్ చేసి ఒక బాటిల్ నీటిలో కలపండి. ఈ నీటిని మీరు రోజంతా తాగొచ్చు.
మజ్జిగ
ఎండాకాలంలో మజ్జిగను తాగితే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. మన దేశంలో చాలా మంది భోజనం చేసిన తర్వాత ఒక పెద్దగ్లాసు మజ్జిగను ఖచ్చితంగా తాగుతారు. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. మజ్జిగలో గట్ మైక్రోబయోమ్ ను మెరుగుపరిచే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగలో ఉప్పు లేదా మసాలా దినుసులను వేసి తాగొచ్చు. కొంతమంది తీయగా ఉండే మజ్జిగను తాగుతారు.
మెంతివాటర్
మెంతివాటర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఉదయాన్నే పరిగడుపున మెంతివాటర్ ను తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ వాటర్ బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఈ వాటర్ ను తాగితే శరీరం పోషకాలను సరిగ్గా గ్రహిస్తుంది. ఇందుకోసం కొన్ని మెంతులను తీసుకుని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఈ విత్తనాలను తీసేసి ఉదయాన్నే తాగండి.
నిమ్మకాయ, పుదీనా డిటాక్స్ వాటర్
కీరదోసకాయ వాటర్ లాగే నిమ్మకాయ, పుదీనా డిటాక్స్ వాటర్ ను కూడా ఉదయాన్నే తాగొచ్చు. నిమ్మ, పుదీనా రీఫ్రెష్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని సాదా నీటిలో కలిపితే వాటర్ రుచి పెరుగుతుంది. పోషకాలు కూడా రెట్టింపు అవుతాయి. ఈ వాటర్ మీ బరువును తగ్గించడమే కాకుండా మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఆపిల్, దాల్చిన చెక్క వాటర్
ఆపిల్, దాల్చిన చెక్కను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ఆపిల్స్ లో ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్క మీ జీవక్రియను పెంచుతుంది. అందుకే ఆపిల్ ను, దాల్చిన చెక్కను నీటిలో కలిపి తీసుకుంటే జీవక్రియలు సజావుగా సాగుతాయి. మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా కూడా ఉంటుంది.
ద్రాక్షనీరు
బరువు తగ్గడానికి ద్రాక్షలు కూడా బాగా సహాయపడతాయి. ఈ సిట్రస్ పండు జీవక్రియను పెంచుతుంది. నీటిని సహజంగా తీయగా చేస్తుంది. అంతేకాదు పోషకాలను పెంచుతుంది కూడా. దీనికోసం మీకు కావాల్సిందల్లా ఒక బాటిల్ నీటిలో కొన్ని ద్రాక్ష ముక్కలను వేయండి చాలు..
నారింజ వాటర్
ఆరెంజ్ వాటర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎండాకాలం బెస్ట్ డీటాక్స్ వాటర్ కూడా. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ వాటర్ ను తాగితే జీవక్రియ పెరుగుతుంది. దీనిని తయారుచేయడానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక బాటిల్ నీటిలో నారింజ ముక్కలను వేసి కొద్ది సేపటి తర్వాత తాగండి.
